రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై శాసనసభలో రెండోరోజైన ఇవాళ చర్చ కొనసాగనుంది. సమాచార – పౌర సంబంధాలు, పరిశ్రమలు, ఐటీ, పురపాలక, కార్మిక, దేవాదాయ, అటవీ, న్యాయ, ఇంధన, విద్యాశాఖకు చెందిన మొత్తం 12 పద్దులపై ఇవాళ చర్చ చేపట్టనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై చర్చ ఉంటుంది.
వైద్య కళాశాలలు, ఆసరా ఫించన్లు, ఆయిల్‌పామ్ సాగు, పోడు భూముల సమస్య, న్యూట్రిషన్ కిట్, పోలీసు శాఖలో ఖాళీల భర్తీ, రైతుబీమా, ఆరోగ్యలక్ష్మీ పథకాలు, షీటీమ్స్ అంశాలు ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకురానున్నాయి. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు సభలో ప్రవేశపెట్టనున్నారు. భద్రాచలం, సారపాక, రాజంపేట గ్రామపంచాయతీల ఏర్పాటు కోసం చట్టాన్ని సవరిస్తూ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు గురువారం రోజున శాసనసభ పలు పద్దులను ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం, రోడ్లు- భవనాల, రిజిస్ట్రేషన్లు, ఆబ్కారీ, పర్యాటకం, క్రీడలు, యువజన వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల పద్దులను ఆమోదించింది.