నిన్న సాయంత్రం ప్రగతి భవన్ లో సమావేశం అయిన తెలంగాణా క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సాదా బైనామాల క్రమబద్దీకరించడానికి అత్యవసర ఆదేశాలు జారీ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అలానే ఉద్యోగ నియామకాల అంశం మీద కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు, నియామకాలకు క్యాబినెట్ ఆమోదం లభించింది. వీటి పైన నేరుగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
ఇక మరో పక్క గవర్నర్ కోటా ప్రభుత్వ ఎమ్మెల్సీలుగా ముగ్గురిని క్యాబినెట్ ఖరారు చేసింది. గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దేవానంద్ లను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఈ ముగ్గురూ ఈరోజు 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పటికిప్పుడు వీరిని ఎంపిక చేయడానికి గల కారణం గ్రేటర్ ఎన్నికలే అంటున్నారు. ఎందుకంటే మేయర్ ను ఎంపిక చేసే సమయంలో వీరి ఓటు కూడా కీలకం కానుంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా వీరు కూడా ఓటు వినియోగించుకోవాల్సి ఉంది. అందుకే హుటాహుటిన వీరిని ఎమ్మెల్సీలని చేస్తున్నారు.