ఈనెల 14న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వైభవోపేతంగా జరపాలని సీఎం కేసీఆర్ మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హెలికాప్టర్ ద్వారా పూలజల్లు కురిపించి పుష్పాంజలి ఘటించాలని తెలిపారు.
అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలను వేసి అలంకరణ చేసేందుకు అతిపెద్ద క్రేన్ వాడాలని సీఎం అధికారులకు సూచించారు. విగ్రహం ప్రారంభోత్సవం సందర్భంగా బౌద్ధ భిక్షువులను ఆహ్వానించి సాంప్రదాయ పద్ధతిలో వారికి మర్యాదలు చేయాలని సీఎం వివరించారు.ప్రతి నియోజకవర్గం నుంచి 300 మందిని సభకు ఆహ్వానించాలని.. విగ్రహావిష్కరణ సభకు 35,700 మంది హాజరయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులు బుక్ చేయాలని చెప్పారు. సభకు అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాశ్‌ను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు.
మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డిలతో కూడిన కమిటీ విగ్రహావిష్కరణ, సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారన్నారు. అంబేడ్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్‌ను ఆ రోజున పిలిపించి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని సీఎం తెలిపారు.