తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల పంపకం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తుంది.సీనియర్ నేతలతో సంప్రదింపులు ముగించే ప్రయత్నాల్లో ఉన్న అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ సారధిగా రేవంత్ రెడ్డి వైపే హైకమాండ్ మొగ్గు చూపించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే సీఎల్పీ నేత భట్టి కూడా సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నారు. భట్టి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ నుండి హైదరాబాద్ కి వచ్చారు. ఆయన కూడా మనకే పీసీసీ అనే కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఇప్పటికే డిసైడ్ అయ్యిందని ప్రచారం జరుగుతుంది.
పీసీసీ కోర్ కమిటీలో ఉన్న ముఖ్య నాయకులను ఢిల్లీకి పిలవడమా..లేదంటే ఫోన్ లో సంప్రదింపులు చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇప్పటి వరకు పార్టీ సంప్రదించలేదు. అయితే రాహుల్ గాంధీ నేరుగా ఆయనతో మాట్లాడతారని తెలుస్తుంది.తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఒక్కటే కాదు..ఆరు కమిటీలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏఐసీసీ ప్రకటించిన గుజరాత్, మహారాష్ట్రలో పీసీసీతో పాటు ఆరు కమిటీలు వేసినట్టు.. తెలంగాణకు కూడా అదే విధానం వర్తించేలా ప్లాన్ చేసినట్టు సమాచారం.
సీనియర్ నాయకులతో సంప్రదింపుల సమయంలోనే అధిష్టానం అభిప్రాయం ఎంటన్నది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పీసీసీ తో పాటు..ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీ , స్ట్రాటజీ కమిటీ, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ, మీడియా అండ్ పబ్లిసిటీ కమిటి , ప్రోగ్రాం ఇంప్లీమెంటేషన్ కమిటీల నియామకం కూడా చేసే అవకాశాలున్నాయి. ఏ కమిటీలో ఎవరుండాలి అనే దానిపై కూడా ఇప్పటికే అధిష్టానం కొంత క్లారిటీ తో ఉన్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ ఎవరికి ఇస్తే.. మిగిలిన కమిటీల్లో ఎవరుండాలి అనే దానిపై ఇప్పటికే కసరత్తు పూర్తైనట్లు తెలుస్తుంది.
పీసీసీ రేవంత్ అయితే..మిగిలిన కమిటీల్లో అసంతృప్తులు పీసీసీ రేసులో ఉన్న వారికి సమాన ప్రాధాన్యత దక్కేలా పదవుల పంపకాలు ఉంటాయని సమాచారం. ఇంఛార్జి ఠాగూర్, ఏఐసీసీ నిర్మాణ బాధ్యతలు చూసే కేసీ వేణుగోపాల్ అంతా సిద్ధం చేశారని ఇక అధికారిక ప్రకటనే మిగిలినట్టు సమాచారం. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరన్న దానిపై కూడా చర్చ మొదలైంది. ఏఐసీసీ కార్యదర్శి గా ఉన్న సంపత్. బీసీల్లో గౌడ సామాజిక వర్గం నుండి ఒకరికి అవకాశం ఉంది.
ఇక జగ్గారెడ్డి పేరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మైనార్టీ కోటాలో ఓ సీనియర్ నాయకుడు పేరు పరిశీలనలో ఉంది. సంపత్ మాత్రం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కంటే ఏఐసీసీ కార్యదర్శి పదవే బెటర్ అని డిసైడ్ అయ్యారట. అధిష్టానం కి కూడా ఇదే అంశాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి కొత్తఏడాదిలోపే కాంగ్రెస్ లో అన్ని కమిటీలను అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.