కరోనా వైరస్ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు, సినిమా ధియేటర్లకు సెలవలు ప్రకటించింది. మార్చి 19 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు మాత్రం యధావిధిగా జరగనున్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రాష్ట్రంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యల మీద శనివారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం హైలెవల్ కమిటీ సమావేశమైంది.
ఈ సందర్భంగా తెలంగాణాలో కరోనా వ్యాపించకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని కీలక అధికారులు చర్చించారు. దీనిపై తెలంగాణ కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఆ తర్వాత దీనిని అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈనెల 15, 16 తేదీల్లో కూడా శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కెసిఆర్ సర్కార్ నిర్ణయించింది. కరోనా దేశ వ్యాప్తంగా చుక్కలు చూపిస్తుంది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
గోవా, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఢిల్లీ, ఓడిస్సా రాష్ట్రాలు సెలవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని విధాలుగా చర్యలు చేపడుతుంది. తెలంగాణా లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక వ్యక్తి డిశ్చార్జ్ కాగా మరో వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు అంటున్నారు.