కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతుంది. దీనితో వేలాది మంది పేదలకు ఇప్పుడు ఆకలి తీవ్ర సమస్యగా మారింది. చాలా మంది ఆకలి తో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది. అసలే వేసవి కాలం… ఆకలి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక వృద్దులు, బిచ్చగాళ్ళు అయితే కనీసం బిచ్చమెత్తుకోవడానికి కూడా దాదాపుగా అవకాశ౦ లేదు. ఒకవేళ డబ్బులు ఉన్నా సరే తినడానికి తిండి లేదు.
ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఉంటే అక్కడే ఉండాలి. దీనితో తెలంగాణా ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఈ విషయంలో సుదీర్గంగా చర్చించి దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ కూడా ఆకలితో అలమటించకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ లో నడుస్తున్న అన్నపూర్ణ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
గతంలో రూ.5కి భోజనం అందించే వారు. ఇప్పుడు అలా కాకుండా పేదలకు, వృద్దులకు అన్నపూర్ణ కేంద్రాల్లో ఉచితంగా భోజనం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపధ్యంలో ఈ కేంద్రాలను మూసివేయాలని భావించినా ఆ తర్వాత మాత్రం పరిస్థితిని గమించిన కేటిఆర్… గురువారం రోజు నుంచి నగరంలోని 150 అన్నపూర్ణ కేంద్రాలలో ఉచిత భోజన వసతులు అమలులోకి తీసుకురావాలని నిర్ణయయించారు. హాస్టల్ లో ఉండే వాళ్ళకు కూడా వీటి ద్వారా భోజనం అందిస్తారు.