RMP డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ షాక్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆర్ఎంపీలు తప్పుడు వైద్యం చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. తప్పుడు వైద్యం, అబార్షన్లు, ప్రసవాలు కొన్ని రకాల సర్జరీలు చేస్తూ కొందరు ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ మందులను రోగులకు ఇస్తున్నారని అటువంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ఈ మేరకు బుధవారం ఆయన జిల్లా వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానికంగా క్లినిక్ లు పెట్టుకుని ఎలాంటి రిజిస్టర్ సర్టిఫికెట్ లేకుండా ప్రాక్టీస్ చేస్తున్న కేంద్రాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రాథమిక వైద్యం వరకు పరిమితం అయ్యే వారిని వైద్యాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, బుధవారం కొందరు ఆర్ఎంపి సంఘాల నేతలు శ్రీనివాసరావును కలిసి తమపై అనవసరంగా దాడులు జరపవద్దని కోరారు.