స్విస్ టెన్నిస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్ వీడ్కోలుపై ప్రపంచ మాజీ నంబర్ వన్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ స్పందించాడు. రోజర్ ఫెదరర్ భావోద్వేగ వీడ్కోలు లాగే తన రిటైర్మెంట్ కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. వీడ్కోలు సమయంలో చిరకాల ప్రత్యర్థులు తన పక్కన ఉండాలని తెలిపాడు.
‘‘హృదయాన్ని కదిలించే క్షణాలవి. ఫెదరర్ పిల్లలు, కుటుంబాన్ని చూసి నేను కూడా భావోద్వేగానికి లోనయ్యా. నేను టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పినప్పుడు అలాంటి వీడ్కోలు ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. కుటుంబం, సన్నిహితులతో పాటు నా చిరకాల ప్రత్యర్థులు, పోటీదారులు వీడ్కోలు సమయంలో కచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నా. అప్పుడే ఆ క్షణాలకు ప్రత్యేకత, ప్రాధాన్యత ఏర్పడుతుంది. టెన్నిస్ చరిత్రలో మరే ప్రత్యర్థులు పోటీపడనన్ని సార్లు రఫెల్ నాదల్, నేను తలపడ్డాం. పోటీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒకరితో మరొకరం తలపడేందుకు వీలైనన్ని ఎక్కువ సార్లు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నా. మాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్ అభిమానులు, ఆటకు ఇదెంతో ఉత్తేజాన్ని ఇస్తుంది’’ అని జకోవిచ్ అన్నాడు.