అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై మ‌రోమారు కొర‌డా ఝులిపించ‌నున్న తెలంగాణ స‌ర్కారు..?

-

అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను స‌హించేది లేద‌ని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. ఎవ‌రైనా అక్ర‌మంగా క‌ట్ట‌డాల‌ను నిర్మిస్తే ఎలాంటి ముంద‌స్తు నోటీసు లేకుండానే స‌ద‌రు నిర్మాణాన్ని కూల్చివేసేలా కొత్త చ‌ట్టం తెస్తామ‌న్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై మ‌రోమారు పంజా విస‌ర‌నుందా..? అంటే అవుననే స‌మాధానం వినిపిస్తోంది. 2014లో స‌మైక్యాంధ్ర విడిపోయాక తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చిన కొత్త‌లో హైద‌రాబాద్‌లో ఉన్న అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై కొర‌డా ఝులిపించారు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళ‌నలు చేప‌ట్టారు. అయితే న‌గరంలో ఉన్న చాలా వ‌ర‌కు అక్ర‌మ క‌ట్ట‌డాల్లో పొరుగూర్ల నుంచి వ‌చ్చి న‌గ‌రంలో స్థిర‌ప‌డి ఇళ్ల‌ను నిర్మించుకున్న వారే ఉన్నారు. దీంతో ఏపీ ప్ర‌జ‌ల దృష్టిలో త‌ప్పుడు సంకేతాలు వెళ్తాయ‌న్న నేప‌థ్యంలోనో.. మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. అప్ప‌ట్లో అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం ఆపేసింది. కానీ ఇవాళ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మ‌రోసారి అక్ర‌మ క‌ట్ట‌డాల ప్ర‌స్తావ‌న తెచ్చారు. దీంతో అక్ర‌మ క‌ట్ట‌డాల య‌జ‌మానుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాల్లో మాట్లాడుతూ… కొత్త‌గా అమ‌లు చేయ‌నున్న మున్సిప‌ల్ చ‌ట్టంపై స‌భ‌లో వివ‌ర‌ణ ఇచ్చారు. అందులో భాగంగా.. 75 చ‌ద‌ర‌పు గ‌జాల లోపు, జీ+1 వ‌ర‌కు ఇంటి నిర్మాణానికి ఎవ‌రూ అనుమ‌తి తీసుకోవాల్సిన ప‌నిలేద‌న్నారు. అలాగే ఇంటి ప‌న్న ఏడాదికి రూ.100 చెల్లిస్తే చాల‌న్నారు. ఇక ఇంటి రిజిస్ట్రేష‌న్‌కు మున్సిపాలిటీలో కేవ‌లం రూ.1 చెల్లిస్తే చాల‌న్నారు. అలాగే కాళ్ల‌రిగేలా రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాల చుట్టూ తిర‌గాల్సిన ప‌నిలేద‌ని, అన్నీ ఆన్‌లైన్‌లోనే జ‌రుగుతాయ‌ని, ఇల్లు నిర్మాణానికి అనుమ‌తిస్తూ జారీ చేసే ప‌త్రాలు నేరుగా ప్ర‌జ‌ల ఇళ్ల‌కే చేరుతాయ‌ని తెలిపారు.

ఇక అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను స‌హించేది లేద‌ని కూడా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. ఎవ‌రైనా అక్ర‌మంగా క‌ట్ట‌డాల‌ను నిర్మిస్తే ఎలాంటి ముంద‌స్తు నోటీసు లేకుండానే స‌ద‌రు నిర్మాణాన్ని కూల్చివేసేలా కొత్త చ‌ట్టం తెస్తామ‌న్నారు. అక్ర‌మ నిర్మాణ‌దారుల‌పై ఉక్కు పాదం మోపుతామ‌న్నారు. ఇక త‌మ ఇంటి స్థ‌లం ఎంత ఉందో ప్ర‌జ‌లే స్వ‌యంగా వెల్ల‌డిస్తూ సెల్ఫ్ స‌ర్టిపికేష‌న్ ఇవ్వాల‌ని కేసీఆర్ అన్నారు. ఒక వేళ అందులో త‌ప్పు చేసినా.. త‌మ‌కు ఉన్న స్థ‌లం కాకుండా త‌ప్పుడు స్థ‌ల వివ‌రాలు ఇచ్చినా.. అలాంటి వారిపై 25 రెట్ల ఫైన్ వేస్తామ‌ని కేసీఆర్ హెచ్చ‌రించారు. ఈ క్ర‌మంలోనే అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను నిర్మించిన వారు ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు గుబులు ప‌డుతున్నారు. మ‌రి ముందు ముందు అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత‌ల విష‌యంలో కేసీఆర్ స‌ర్కారు ఎలాంటి వైఖ‌రిని అనుస‌రిస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version