తెలంగాణలో 12 జిల్లాల్లో డ్రగ్ స్టోర్స్

-

తెలంగాణలో కొత్తగా 12 జిల్లాల్లో డ్రగ్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆర్థిక ఏడాదిలో ఆరు, వచ్చే ఏడాది మిగిలిన ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపింది. జాతీయ వైద్య మిషన్‌ పథకం కింద వీటికి ఒక్కోదానికి రూ.3.60 కోట్ల చొప్పున మొత్తం రూ.43.20 కోట్లను మంజూరు చేసింది.

ఈ ఏడాది సిద్దిపేట, వనపర్తి, మహబూబాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్‌ భూపాల్‌పల్లి… వచ్చే ఏడాది నాగర్‌కర్నూలు, సూర్యాపేట, వికారాబాద్‌, జోగులాంబ, యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం రోగి ఇంటికి వెళ్లేటప్పుడు వైద్యుడు రాసిన మందులను కూడా నిర్దేశించిన రోజుల వరకూ అందజేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో తొలిసారిగా 20 కోట్లతో ‘బయో వైద్య సామగ్రి నిర్వహణ’ పేరుతో వైద్య పరికరాల నిర్వహణకు పాలసీ రూపొందించారు. వైద్య పరికరాలను ఎప్పటికప్పుడు నిర్వహించేందుకు ప్రత్యేకంగా ప్రోగ్రాం మానిటరింగ్‌ యూనిట్‌ (పీఎంయూ)ను టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీలో ఏర్పాటు చేసినట్లు వైద్యశాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏ ఆసుపత్రుల్లో ఏమేం వైద్య పరికరాలున్నాయి, వాటి తయారీ తేదీ, వారంటీ తేదీ, గతంలో జరిగిన మరమ్మతుల వివరాలు, ప్రస్తుత మెయింటెనెన్స్‌ కాంటాక్ట్‌ వివరాలు ఇలా అన్నీ వెబ్‌పోర్టల్‌లో ఉంటాయి. వీటికి కంట్రోల్‌ రూం (సెల్‌ నంబర్‌ 8888526666) ఏర్పాటు చేసినట్లు వివరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version