కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరోమారు లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల రూల్ కర్వ్స్ రూపకల్పనకు సంబంధించి తమ అభిప్రాయాలను కూడా ముసాయిదాలో పొందుపర్చాలని కోరింది. అందుకు అనుగుణంగా సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి తాము అడిగిన అనుమతుల వివరాలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్.. కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు తాజాగా మరో లేఖ రాశారు.
శ్రీశైలం జలాశయం సహా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తదితర ఏపీలోని ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని తాము కోరామని లేఖలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కోరారు. ప్రత్యేకించి 1981 మార్చ్ 28న జరిగిన 16వ టీఏసీ సమావేశం ముందు ఉంచిన నోట్ కావాలని కోరినట్లు లేఖలో గుర్తు చేశారు.