ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీజేఐ ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తూ ఈ కేసును అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐతో విచారణ విషయంలో తమ అభ్యంతరాలను డివిజన్ బెంచ్ పరిగణనలోకి తీసుకోలేదని ఆయన కోర్టుకు తెలిపారు.
దర్యాప్తు సీబీఐ చేతుల్లోకి వెళితే.. ఇప్పటివరకు జరిగిన విచారణ అంతా దెబ్బతింటుందని దవే పేర్కొన్నారు. బుధవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మరోసారి మెన్షన్ చేయాలని, విచారణ తేదీ ఇస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ఒక వేళ మెన్షన్ చేయకపోయినా.. వచ్చే వారం కేసు విచారణకు వస్తుందన్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ ఇచ్చిన తీర్పును రెండు వారాలు నిలిపివేయాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసేందుకు సిద్ధమవుతోందని.. అందుకోసం సుప్రీంకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆపాలని సింగిల్ జడ్జిని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బెంచ్ అత్యవసర విచారణకు స్వీకరించింది. ఈ కేసుపై విచారణ చేపట్టేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.