కోర్టు మాట: కేసీఆర్ సర్కార్ కు ఉత్సాహం పోయిందా?

-

గతకొన్ని రోజులుగా కరోనా విషయంలో హైకోర్టు తెలంగాణ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలే చేస్తుంది! దానికి తగ్గట్లుగానే కరోనా విషయంలో కేసీఆర్ చేస్తోన్న ప్రవర్తన, తీసుకుంటున్న నిర్ణయాలు ఉంటున్నాయనే విమర్శలూ వస్తున్నాయి. కరోనా వచ్చిన కొత్తల్లో… కేసీఆర్ నిజంగానే మామూలు హడావిడి చేయలేదు! కేంద్రప్రభుత్వాన్ని మించి జాగ్రత్తలు తీసుకున్నారు.. ఈ నిబంధనలు అన్నీ మనందరి బాగుకోసమే.. బ్రతికుంటే ఏ బలుసాకో తిని బ్రతకొచ్చు.. కష్టమొచ్చినప్పుడు అంతా కలిసికట్టుగా ఉండాలి.. అవసరమైతే కొన్ని త్యాగాలు చేసుకోవాలి.. అని మాట్లాడారు. కానీ రాను రానూ కేసీఆర్ లో కరోనా అంటే ఉన్న భయం, తీసుకోవాల్సిన జాగ్రత్తల మాటల్లో వేడి తగ్గిపోయాయి.. ఫలితం ప్రతిపక్షాల విమర్శలు, హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

మొదట్లో.. కేసీఆర్ కరోనాను సీరియస్ గా తీసుకున్నారు అన్న మాటలు వెలువడిన కొత్తల్లో.. తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువనే చెప్పాలి. తర్వాత ఏమైందో ఏమో.. తెలంగాణ సర్కార్ లైట్ తీసుకున్నట్లుగా ఉంది.. ఫలితంగా కరోనా కంట్రోల్ తప్పింది! దీంతో కేసీఆర్ సర్కార్ కరోనాను కంట్రోల్ చేయడంలో చేతులెత్తేసిందన్న ప్రచారం ఎక్కువైంది. ఇదే విషయాలపై తాజాగా తెలంగాణ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తాజాగా హైకోర్టు “కరోనాను ఎదుర్కొనే సన్నద్ధత తెలంగాణ ప్రభుత్వంలో కనిపించట్లేదు.. వైరస్ నియంత్రణపై సర్కార్ కు ఆసక్తి ఉత్సాహం పోయింది” అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ధోరణి చూస్తుంటే ప్రజలే ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలన్నట్టు కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. పరీక్షలు తక్కువ చేస్తే తీవ్రత ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. తమ ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని.. గాంధీలో జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం పరిస్థితికి అద్దం పడుతోందని హైకోర్టు కెసీఆర్ సర్కార్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈమాటలు చాల పెద్దవనే చెప్పాలి. సాధారణంగా న్యాయస్థానాలు.. పరిస్థితులు ఎంతో చేయిదాటిపోయినట్లు కనిపిస్తే తప్ప ఈస్థాయిలో ఘాటైన వ్యాఖ్యలు చేయవు అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపై అయినా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయనో, కోర్టులు మొట్టికాయలు వేస్తాయనో కాకుండా.. ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వం తన బాధ్యతను గుర్తెరగాలని ప్రజలు కోరుకుంటున్నారు! కేసీఆర్ ఇకనైనా కళ్లు తెరుస్తారని, కరోనా విషయంలో నిర్లక్ష్యాన్ని వీడాలని, మొదట్లో చూపించిన ఉత్సాహాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version