Telangana : వాహన ప్రమాద పరిహారాలపై హైకోర్టు ఆగ్రహం

-

మోటారు వాహన ప్రమాదాల్లో గాయపడిన వారు.. మృతి చెందిన వారి బంధువులు పరిహారం కోసం 6 నెలల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం 2019లో మోటారు వాహన చట్టానికి సవరణ తీసుకురావడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఈ చట్టంలోని సెక్షన్‌ 166(3) నిబంధన అమానవీయంగా ఉందని పేర్కొంది.

మన దేశంలో కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఉత్తర క్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తిచేసి కోలుకోవడానికే ఆ కుటుంబానికి ఏడాది పడుతుందని.. ఆ పైనే పరిహారం గురించి ఆలోచిస్తారంది. మోటారు వాహన చట్ట సవరణపై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

పరిహారం కోసం దాఖలు చేసిన దరఖాస్తును నిజామాబాద్‌ మోటారు ప్రమాదాల క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ అదే జిల్లా మాక్లూర్‌ మండలం అమ్రాద్‌ గ్రామానికి చెందిన ఎ.నవనీత.. మరొకరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది కె.భాస్కర్‌రావు వాదనలు వినిపించారు. డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జి.ప్రవీణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. కనీసం ఏడాది గడువు ఉంటే సబబుగా ఉంటుందని, దీనిపై కేంద్రం వివరణ తెలుసుకుంటానన్నారు. ఇందుకు ధర్మాసనం అనుమతిస్తూ విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version