హైదరాబాద్: తెలంగాణలో లాక్‌డౌన్ సడలించనున్నారని తెలుస్తోంది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలవరకు మినహాయింపులు ఇస్తారని సమాచారం. సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూను కొనసాగించనున్నారు. జూన్ నెలాఖరువరకు బార్‌లు, పబ్‌లు, క్లబ్‌లు, మాల్స్, థియోటర్లు మూసివేసి ఉంచనున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు. మంగళవారం జరగబోయే కేబినెట్ భేటీలో సడలింపు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో మధ్యాహ్నం 2 గంటల వరకు మినహాయింపు ఉంది. లాక్ డౌన్ సడలింపు విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
జూన్ 8న మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్., రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ఈ భేటీలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో భాగంగా ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాల మీద సమీక్ష జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పంట పెట్టుబడి సాయం, రైతుబంధు, కల్తీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, ఎరువులు క్రిమిసంహారక మందుల లభ్యత, తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపైనా కేబినెట్ చర్చించే అవకాశాలున్నాయి.