కేంద్రంలోని బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుంది : మంత్రి ఎర్రబెల్లి

-

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ పాలనా తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని ఆరోపించారు మంత్రి ఎర్రబెల్లి. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనమని అన్నారు. ఈ రోజు ప్రజాస్వామిక పార్లమెంట్ వ్యవస్థలోనే ఒక చీకటి రోజని అన్నారు ఆయన. పరువునష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి సంగతి ఏమిటని మండిపడ్డారు. వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదని విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి. ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతున్నదని మండిపడ్డారు. దేశాన్ని దోచుకునే దొంగల కోసమే బీజేపీ పని చేస్తుందని తెలిపారు.బీజేపీ ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తుందని విమర్శించారు. బీజేపీ చర్యలను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఖండించి బీజేపీ కి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.

 

తెలంగాణ రైతులకు కాళేశ్వరం సాగు నీరు, 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నారని వెల్లడించారు. కేసీఆర్‌ దయ వల్ల రాష్ట్రం సస్యశ్యామలమయ్యిందని,భూగర్భ జలాలు పెరిగాయని పేర్కొన్నారు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. దేశ వ్యాప్త రైతుల కోసం ఉద్యమించిన 7వేల మంది రైతులను బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వేదికగా రూ. 200 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. కాని రూ. 1250 కి పెంచారని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెంచిన ప్రజా వ్యతిరేక ప్రభుత్వం బీజేపీదని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version