సెప్టెంబరు 17న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో మునిగిపోయారు. వజ్రోత్సవ వేడుకలకు భాగ్యనగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది.
హైదరాబాద్ మహానగరం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ముఖ్యమైన ప్రభుత్వ భవనాలను అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. అసెంబ్లీ, బీఆర్కే భవన్, జీహెచ్‌ఎంసీ, డీజీపీ కార్యాలయాలు.. విభిన్న రంగుల్లో మెరిసిపోతున్నాయి. మరిన్ని ప్రభుత్వ భవనాలు, పార్కులకు కూడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు.
వజ్రోత్సవాల సందర్భంగా ఈనెల 17న ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లక్షమంది హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ సభకు ముందు హైదరాబాద్‌లో ఆదివాసీ, బంజారాభవన్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. గిరిజన, ఆదివాసీ, గోండు కళారూపాలతో నెక్లెస్ రోడ్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నేతలను సభకు ఆహ్వానించారు.