ఏపీ ప్రభుత్వ విప్ ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు ఉదయభాను వెళ్లారు. అయితే.. ఏపీ – టీఎస్ బోర్డర్ దొండపాడు గ్రామం వద్ద భారీగా మోహరించిన తెలంగాణ పోలీసులు… ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఉదయభాను అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ ఘటనపై ఉదయభాను మాట్లాడుతూ… వైఎస్ ఉమ్మడి ఏపీలో ఎక్కువ ప్రాజెక్టులు తెలంగాణలోనే కట్టారని.. ఆ విషయం మరిచి తెలంగాణ మంత్రులు వైఎస్ పై విమర్శలు చేయడం దారుణమని ఫైర్ అయ్యారు.
కేసీఆర్, కేటీఆర్ లను మేం విమర్శించకపోయినా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఉదయభాను. పులిచింతల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లకుండా టీఎస్ పోలీసులు అడ్డుకోవటం దారుణమని పేర్కొన్నారు. జల విధానానికి విరుద్ధంగా జరుగుతున్న నీటి వాడకంపై ప్రధానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు ఉదయభాను.
కాగా… ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిన్న నారాయణ పేట జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ సైతం… ఏపీతోనే కాదు… దేవుడితోనైనా పోరాడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.