గ్రేట్ ;ఈ పేద తల్లికి ఆకలి విలువ తెలుసు.. తన రేషన్ లో సగం దానం చేసింది..!

-

అమ్మకు ఆకలి తెలుసు… అంత బాగా నాన్నకు కూడా బిడ్డల ఆకలి గురించి తెలియదు ఏమో… ప్రపంచంలో ప్రతీ అమ్మా కూడా తన బిడ్డల ఆకలి గురించే ఆలోచిస్తుంది. తన పిల్లలు తిన్న తర్వాతే తనకు ఆకలేస్తుంది. తెలంగాణాలో ఒక అమ్మ ఇప్పుడు తన బిడ్డల ఆకలే కాదు… అందరి బిడ్డల ఆకలి ఆలోచించింది. ఇద్దరు కొడుకులు, కూతురు, కోడలు కూడా ఉంది. ఆమె వితంతువు… అద్దె ఇంట్లో కూలి నాలీ చేసుకుని జీవితం నెట్టుకోస్తుంది.

ఇప్పుడు లాక్ డౌన్… కరోనా కారణంగా ఎవరూ కూడా బయటకు వెళ్ళకూడదు. పది రూపాయల ఉపాధి కూడా ఉండదు బయట. అందుకు తెలంగాణా ప్రభుత్వం ప్రతీ మనిషికి 12 కేజీల రేషన్ బియ్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఆమె కుటుంబానికి 60 కేజీలు వచ్చాయి. ఆమె పేరు అనురాధ… తనకు 60 కేజీలు వద్దు… ఆకలితో అలమటిస్తూ రేషన్ కార్డు లేక పిల్లలను పస్తు పడుకోబెట్టే అమ్మా నాన్నకు ఇవ్వండి అంటూ,

30 కేజీలు రేషన్ షాపులో ఇచ్చేసింది… అంబాని చేసిన సాయం గురించి మాట్లాడుకునే మనం ఈ సాయాన్ని గుర్తించలేదు. కనీసం ఆమెను సోషల్ మీడియాలో కూడా పొగడలేకపోయాం. ఇంతకు ఆమె ఎందుకు అలా ఇచ్చిందో తెలుసా…? తన కొడుకు లాక్ డౌన్ వలన వేరే ప్రాంతంలో ఉండిపోయాడట. ఇక్కడ తాను వీళ్ళ కడుపు నింపితే అక్కడ ఇంకోక అమ్మ తన బిడ్డ కడుపు నింపుతుంది కదా…?

అని చెప్పి ఆమె బియ్యం దానం చేసింది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే… తెలంగాణా రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా షామీర్ పేట మండలం, తుర్కపల్లి గ్రామ౦లో జరిగింది. ఆమె బియ్యం తిరిగి ఇస్తున్నప్పుడు జిల్లా అదనపు కలెక్టర్ విద్యా సాగర్ అక్కడే ఉన్నారు. అమ్మా మీది పేద కుటుంబం కదా వద్దు ఉంచుకోండి అంటే… అప్పుడు తన కొడుకు గురించి ఆయనకు చెప్పింది. ఆమె మాట విన్న కలెక్టర్ ఆమెకు చేతులు ఎత్తి దండం పెట్టారు.

ఆ అమ్మ అలా ముందుకు రాగానే ఆమెను స్పూర్తిగా తీసుకుని శామీర్ పేట మండలంలో లబ్ది దారులు ఏకంగా 9500 కేజీల బియ్యం దానం ఇచ్చారు. ఈ విషయాన్ని తహసిల్దార్ మీడియాకు వివరించారు. ఆమె అలా ముందుకి వచ్చి ఇవ్వడం చూసి కలెక్టర్ కూడా ఆమెను చూసి భావోద్వేగానికి గురయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అనురాధను అభినందించారు. ఈ ఘటన తెలంగాణాలో ఇప్పుడు హాట్ టాపిక్. మనలోకం అనురాధ గారిని మనస్పూర్తిగా అభినందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version