ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ సంస్థ దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు రంగం చేసింది. డీజిల్ ధరలు పెరగడం, నష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు.. ప్రయాణికులపై భారం వేసేలా ప్రణాళికలు చేస్తోంది ఆర్టీసీ. టికెట్ ఛార్జీల పెంపునకు కేసీఆర్ సర్కార్ ఇంకా అనుమతి ఇవ్వకపోవడంతో.. సెస్ ల పేరుతో ప్యాసింజర్ల పై భారాన్ని మోపుతోంది.
గత నెలలో టోల్ సెస్, టిక్కెట్ ఛార్జీల సవరణచ, ప్యాసింజర్ సెస్ ల పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు ఛార్జీలు పెంచిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ.. తాజాగా డీజిల్ సెస్ పేరుతో మరో వడ్డనకు సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.
నష్టాల ఊబి నుంచి కొంత మేరకైనా.. బయటపడేందుకు గాను డీజిల్ సెస్ విధించాలని భావిస్తోంది. ఈ సెస్ పేరిట ఛార్జీలను మరో 10 నుంచి 15 శాతం వరకు సవరించాలని ఆర్టీసీ సంస్థ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అనంతరం ప్రకటన రానుంది.