నిన్న ప్రగతిభవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఉదయం 11:30 గంటలకు సీఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పునః ప్రారంభమై సాయంత్రం 10 గంటల వరకు జరిగింది. అయితే ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, అర్హులైన, ఎంపిక చేయబడిన లబ్ది దారులకు, సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. యూనిట్ ఒక్కంటికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని అఖిల పక్ష సమావేశం సమిష్టి నిర్ణయం తీసుకున్నది.
మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకు గాను 1200 కోట్లతో “సీఎం దళిత సాధికారత పథకం” ప్రారంభం చేయాలని, ఎంపిక చేయబడిన బాటమ్ లైన్ లో వున్న కడు పేద దళిత కుటుంబానికి (రైతు బంధు పథకం మాదిరి) నేరుగా అందచేయాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్షం నిర్ణయించింది. ఈ నిర్ణయానికి సిఎం కెసిఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దళిత జనోద్ధరణకు సీఎం ఆలోచనలు, ఇప్పటికే అమలుపరుస్తున్న కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయనీ, దళిత సాధికారత పథకంతో మరింత గొప్పగా దళితుల జీవితాలు మారుతాయనీ అఖిలపక్ష సమావేశం అభిప్రాయపడింది.