పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగా పుర సేవలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరువ అయ్యే విధంగా ఆన్లైన్ సేవలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ కాస్త ముందుంది. తెలంగాణ ప్రభుత్వం ఇ – గవర్నెన్స్ లో దేశంలో ఐదో ర్యాంకు సాధించి, మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించి, పౌరులకు ఆన్లైన్ సేవలు సత్వర రీతిలో అందించడంతో ఇది సాధ్యమైంది.
ఈ క్రమంలో పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో స్థానానికి పరిమితం అయింది. నేషనల్ ఇ – గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ ఎసెస్మెంట్ విడుదల చేసిన ర్యాంకుల వివరాల్లో గ్రూపు ఏ కేటగిరీలో కేరళ, తమిళ నాడు, పంజాబ్ మొదటి మూడు స్థానాలూ గెలుచుకున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుంచి పౌర సేవలను ఆన్లైన్ ద్వారా ఎక్కువ మందికి దగ్గర చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్వర ఫలితాలు ఇచ్చింది. స్థానిక సంస్థలు కూడా ఇ గవర్నెన్స్ ను అందుకున్నాయి. తద్వారా ఆర్థిక వ్యవహారాలు, స్థానిక సంస్థలు, గృహావసరాలతో సహా ఇతర సేవలను పౌరులు ఆన్లైన్ ద్వారా వినియోగించుకుని, సమయం ఆదా చేసుకున్నారు.
ముఖ్యంగా వివిధ పోర్టల్స్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం పౌర సేవలకు కనెక్ట్ అయి ఉంది. వీటిలో కొన్ని మంచి ఫలితాలు ఇచ్చాయి. డిగ్రీ ప్రవేశాల కోసం కూడా ఆన్లైన్ విధానాన్నే అందుబాటులోకి తెచ్చింది. డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ పేరిట సేవలను అందుబాటులోకి తెచ్చింది. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ల పోస్టులకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ విధంగా ప్రతి సేవనూ ఆన్లైన్ పరిధిలోకి తేవడం ద్వారా ఒక్క క్లిక్ దూరంలోనే పౌర సేవలు అందుబాటులోకి వచ్చాయి. పోలీసు డిపార్ట్మెంట్ లో కూడా ఆన్లైన్ ఫిర్యాదు నమోదుకు ఎక్కువ అవకాశం ఇస్తుంది.
ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి ఇ గవర్నెన్స్ ను ఎక్కువగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వీటి నిర్వహణలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా ఇ రికార్డ్స్ కే ఎక్కువగా ప్రయార్టీ ఇస్తున్నారు. భూమికి సంబంధించి రికార్డులు, అదే విధంగా ప్రభుత్వ పథకాల వివరాలు, తరువాత లబ్ధిదారుల జాబితా, అందించిన మొత్తాలు ఇలా ఒక్కటేంటి అన్నింటినీ ఆన్లైన్ లోకే తీసుకువచ్చారు. విద్యుత్ రంగంలో కూడా ఆన్లైన్ బిల్ పేమేంట్, ఆన్లైన్ కంప్లైంట్ ఫైలింగ్ లాంటివి తీసుకువచ్చారు. ఇవన్నీ మెరుగైన ఫలితాలు ఇవ్వడంతో ఇకపై మరిన్ని పుర సేవలను ఆన్లైన్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. విద్యాశాఖలో కూడా వివిధ సెట్ల నిర్వహణ, అడ్మిషన్ ప్రాసెస్ ను ఆన్లైన్ చేశారు. ఇంకొన్ని విభాగాలకూ ఈ సేవలను విస్తృతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. తాజా ర్యాంకింగ్ పై తెలంగాణ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తుంది.