తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ రోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కిడ్నీ వ్యాధి గ్రస్థులకు డయాలసిస్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ఉద్ధేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో 61 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో కొత్తగా 515 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లా, ప్రాంతీయ ఆస్పత్రుల్లో మాత్రమే ఉన్న డయాలసిస్ సేవలు ఇక నుంచి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా డయాలసిస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కాగ మొదటగా ఐదు ఆస్పత్రులనున ఎంచుకుని డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో 5 డయాలసిస్ పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. నాగర్జున సాగర్ లోని కమలానెహ్రూ ప్రాంతీయ ఆస్పత్రి, సిద్ధిపేట్ జిల్లాలోని దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి, హుస్నాబాద్ సమాజిక ఆరోగ్య కేంద్రం, జిగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రాంతీయ ఆస్పత్రి, రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ సామాజిక ఆరోగ్యం కేంద్రంలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.