తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పుడు అప్పుడు అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరుగురికే మంత్రివర్గంలో చోటు అంటూ ఎన్ని వార్తలు వచ్చినా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఈ వ్యవహారంలో ఢిల్లీకి ఎన్నిసార్లు చక్కర్లు కొట్టినా ఇప్పటివరకు ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. ఇటీవలే ఇప్పట్లో కేబినెట్ విస్తరణ ఉండబోదంటూ రాష్ట్ర నేతలు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశంపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ విస్తరణ చేపట్టాలని అధిష్ఠానం నిర్ణయించినప్పటి నుంచి తనపై కొందరు నాయకులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తన గొంతు కోయాలని ఓ కుటుంబం ప్రయత్నిస్తోందని అన్నారు. మంచిర్యాలలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్.. తన గొంతు కోయాలని చూస్తే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్ నేతల కుటిల ప్రయత్నాలను తాను తప్పకుండా తిప్పి కొడతానని ధీమా వ్యక్తం చేశారు.