‘గృహజ్యోతి’ అమలులో మరో కిటుకు పెట్టింది తెలంగాణ సర్కార్. ఇళ్లకు ఉచిత కరెంటు సరాఫరా పథకం ‘గృహజ్యోతి’ అమలు ప్రక్రియలో భాగంగా లబ్ది పొందాలనుకునేవారు తోలుత ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపుకార్డులు అవసరమని తెలిపింది.
బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధనశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. దీన్ని బట్టి లబ్ధిదారుల ఎంపికకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు తర్వాత వెలువడుతాయని భావిస్తున్నారు. గృహ జ్యోతి పథకం లబ్ధిదారుల ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియను డిస్కంలు చేపట్టాలని ఇంధనశాఖ నిర్దేశించింది.