గృహజ్యోతి పథకం అమల్లో భాగంగా ఇళ్లకు ఉచితంగా కరెంటు సరాఫరా చేసే స్కీమ్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్లకు ఉచిత కరెంటు సరాఫరా పథకం ‘గృహజ్యోతి’ అమలు ప్రక్రియలో భాగంగా లబ్ది పొందాలనుకునేవారు తోలుత ఆధార్ ధ్రువీకరణ చేయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాయితీ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలంటే ఆధార్ సహా గుర్తింపుకార్డులు అవసరమని తెలిపింది.
బయోమెట్రిక్ విధానంలో ఆ ధ్రువీకరణ పూర్తి చేస్తేనే పేర్లు నమోదు చేస్తామని ఇంధనశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పథకం అమలు కోసం ఎప్పటికప్పుడు జారీ చేసే ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కంలకు సూచించింది. ఇంటి కరెంట్ కనెక్షన్ ఎవరి పేరుతో ఉందో వారి ఆధార్ ను సిబ్బందికి అందించాలని కోరింది. ఆధార్ లేకపోతే తక్షణమే అప్లై చేసుకుని, దాని వివరాలు అందించాలంది. ఆధార్ రానివారు బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, కిసాన్ పాస్ బుక్ ఇచ్చి పేర్లు నమోదు చేసుకోవాలంది.