హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఓ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులు లేకుండానే విమానాలు వెళ్లిపోయిన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశీయ విమాన సర్వీసుల్లో ప్రధాన నగరాలకు వెళ్లడానికి ఓ ఎయిర్‌లైన్స్ సంస్థలో టికెట్లు కొనుగోలు చేసిన కొందరు ప్రయాణికులు.. విమానాశ్రయానికి చేరుకుని వెబ్ చెక్ ఇన్ కోసం యత్నించగా సర్వర్ పని చేయలేదు. టికెట్‌లు చేతుల్లో ఉన్నా ప్రయాణికుల జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో సిబ్బంది వారిని గేటు లోపలికి అనుమతించలేదు. సహనం కోల్పోయిన కొందరు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆలస్యంగా స్పందించిన యాజమాన్యం తమ వేరే సర్వీసుల్లో గమ్యస్థానాలకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఈ విషయంపై విమానాశ్రయ అధికారులను సంప్రదించగా సమస్య తమ దృష్టికి రాలేదని అన్నారు.