ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కీలకనేతలు ఇతర పార్టీల్లోకి జంపింగులతో ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. సర్వేలన్నీ వైసీపీకే పట్టం కట్టాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రచారం మరింత జోష్ గా సాగుతోంది. బస్ యాత్ర తరువాత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సీఎం జగన్ సైతం కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.
ఈ ఎన్నికల తరువాత వైసీపీ అధికారంలోకి వస్తే కేబినెట్లోకి చాలావరకు కొత్తవారిని తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు సీఎం జగన్ కూడ కేబినెట్ కూర్పుపై ముందస్తు కసరత్తు చేసినట్లు సమాచారం. ఇదే క్రమంలో కుప్పం అభ్యర్థి భరత్ కి సీఎం జగన్ బంపర్ అఫర్ ఇచ్చారు. చంద్రబాబుపై గెలిస్తే మంత్రి వర్గంలో భరత్ కి చోటు కల్పించబోతున్నారు. దీంతో కుప్పం నియోజకవర్గంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తన సొంత నియోజకవర్గం పుంగనూరు కంటే కుప్పంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. టీడీపీలోని కీలక నేతలను వైసీపీలోకి లాగేసారు పెద్దిరెడ్డి. ఇప్పటికి ఏడుసార్లు కుప్పం నుంచి చంద్రబాబు గెలిచారు. మరోసారి విజయం తనదేనంటూ ధీమా వ్యక్తపరుతున్నారు. అయితే ఎలాగైనా చంద్రబాబుని ఓడించి కుప్పంని వైసీపీ ఖాతాలో వేయాలని తీవ్ర కసరత్తు చేస్తున్నారు.
చంద్రబాబు ఓటమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోంది. పలువురు మంత్రులు కుప్పంలో భరత్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి కూడా కుప్పంలో ప్రచారానికి వచ్చారు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు సొంత నియోజకవర్గానికి ఏమీ చేయలేదని ఆమె విమర్శించారు. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం జగన్ ఆ సమస్య తీర్చారని అన్నారు. భరత్ ని గెలిపిస్తే మంత్రి అవుతాడని, కుప్పం నియోజకవర్గం మరింతగా అభివృద్ధి చెందుతుందని కుప్పం ప్రజలకు ఆమె సూచించారు. మొత్తానికి చంద్రబాబుని ఓడించేందుకు వైసీపీ గట్టి ప్లాన్ వేసినట్టుంది.