సీఎం రేవంత్ జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈనెల 25న ఎల్బీ స్టేడియంలో భారీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి హాజరై 44 వేలమంది పోలింగ్ బూత్ స్థాయి అధ్యక్షులకు ఎన్నికలపై దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ సభ అనంతరం సీఎం రేవంత్ జిల్లాల్లో పర్యటిస్తారని సమాచారం.
మంత్రులు కూడా తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళ్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కాగా, లండన్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బిజీ బిజీ గడుపుతున్నారు. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. లండన్ లో ప్రపంచ ప్రసిద్ధమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక కట్టడాలనూ, స్మారక కేంద్రాలను ఆయన సందర్శించారు.
బిగ్‌బెన్, లండన్ ఐ, టవర్ బ్రిడ్జ్ ఎట్ ఆల్ కట్టడాలను సీఎం తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను సీఎం అడిగి తెలుసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో సీఎం అక్కడ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేశారు.