కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో ఏఐసీసీ జోక్యం అనివార్యమైనట్లు సమాచారం. పోటీ తీవ్రంగా ఉండటం, నాయకులు తాము సూచించిన వారికే టికెట్లివ్వాలని పట్టుబడుతుండటం వంటి వాటి వల్ల స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఏఐసీసీ నిర్ణయానికి వదిలిపెట్టినట్లు తెలిసింది. ఈనెల 14వన తెలంగాణపై ఏఐసీసీ భేటీ కావచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపై మురళీధరన్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ నాలుగుసార్లు సమావేశమై.. సుదీర్ఘంగా చర్చించింది. ముఖ్య నాయకులే కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల కోసం పట్టుబట్టడం… సర్వే ఆధారంగా ముందున్న పేర్లు, పీసీసీ అధ్యక్షుడు సూచించిన పేర్లు భిన్నంగా ఉండటంతో తుది నిర్ణయం ఏఐసీసీకి వదిలేసినట్లు సమాచారం. పరస్పర చర్చలు, వాదోపవాదాల తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చి, 72 నియోజకవర్గాలకు కమిటీ ఒకే పేరును సూచించినట్లు తెలిసింది. ఏడింటి విషయంలో మాత్రం తాము సూచించిన వారికే టికెట్లు ఇవ్వాలంటూ నాయకులు గట్టిగా పట్టుబట్టినట్లు సమాచారం. వీటన్నింటిపై 14న చర్చ జరిపి వీలైనంత త్వరగా అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.