రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమాయమయ్యాయి. వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తి, పశునష్టం సంభవించాయి. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ సమీక్షకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, సిఎస్ శాంతి కుమారి, డిజిపి జితేందర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వరదల్లో చనిపోయిన పశువులు, మేకలు గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులను ఆదేశించారు రేవంత్. భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన పాడి గేదెలు ఒక్కో దానికి ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 30 వేల నుండి 50 వేల వరకు పెంచారు.
మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కో దానికి ఇచ్చే 3,000 సహాయాన్ని ఐదువేలకు పెంచాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి పదివేల చొప్పున పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలన్నారు. తక్షణం బాధ్యత కుటుంబాలకు పరిహారాన్ని అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.