మూసీపై సీఎం రేవంత్ మరో ప్రకటన చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని పలు పురాతన మెట్ల బావుల పునరుద్ధరణ కోసం సీఐఐతో రాష్ట్ర పర్యాటక శాఖ శుక్రవారం ఒప్పందం చేసుకుంది. కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంగా కారణంగా నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు. ప్రస్తుతం పాత అసెంబ్లీ భవనాన్ని పునరుద్దరిస్తున్నామని, త్వరలోనే అందులో శాసన మండలి ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్ కు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. ప్రత్యేక టెక్నాలజీతో ఆ భవనాన్ని నిర్మించారని, భవిష్యత్తులో దాన్ని పరిరక్షించాల్సిన అవసరముందని సీఎం అభిప్రాయపడ్డారు. జూబ్లీహాల్ ను దత్తత తీసుకొని పరిరక్షించాలని ఆయన సీఐఐకి సూచించారు. ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షిస్తామని, ఇందుకోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉస్మానియా ఆస్పత్రిని గోషామహల్ స్టేడియానికి తరలిస్తున్నట్లు సీఎం వివరించారు. హైకోర్టు భవనాన్ని కూడా రక్షించాల్సిన అవసరముందని సీఎం అన్నారు.