నారాయణపేట జిల్లా మరికల్లో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరికల్ ఎస్సై రాము, గ్రామస్తుల నుండి సేకరించిన ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక ఐదవ తరగతి చదువుతోంది. ఈనెల 25వ తేదీన పాఠశాల ముగియగానే ఇంటికి వచ్చి హోం వర్క్ చేసుకుంటూ కూర్చుంది. తండ్రి అప్పుడే ఇంటికి వచ్చాడు. మిగతా కుటుంబ సభ్యులు వివిధ పనుల కోసం బయటకు వెళ్లారు. ఒంటరిగా ఉన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో తండ్రి ఇంట్లో నుంచి పరార్ అయ్యాడు.
కూతురు రక్తపు మడుగులో ఉండటాన్ని చూసి తల్లిడిల్లిపోయిన తల్లి.. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యుల సూచన మేరకు మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. విషయాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్కు తెలియజేయడంతో.. సమాచారం అందుకున్న మరికల్ ఎస్సె హుటాహుటిన గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు. తండ్రి కోసం గాలిస్తున్నారు.