ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న జగన్కు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి, వేణుగోపాలాచారి ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్ వారితో కలిసి బంజారాహిల్స్‌లోని నందినగర్లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. అక్కడ జగన్కు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వాగతం పలికారు.
అనంతరం కేసీఆర్ను జగన్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కు పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించారు. ఆ సమయంలో అక్కడ కేటీఆర్, ఎంపీ సంతోష్తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. వీరంతా తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై కాసేపు చర్చించినట్లు సమాచారం.
మరోవైపు గత నెలలో ప్రమాదవశాత్తు తన నివాసంలో కేసీఆర్ జారిపడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు ఆయనకు ఎడమ తుంటికి శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.