నాగార్జునసాగర్ డ్యాం వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఈ వివాదంపై రెండు రాష్ట్రాల పోలీసులు పరస్పరం కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు ఫిర్యాదు చేయగా కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర పోలీసులు, అధికారులపై ఏపీలో కేసులు నమోదు చేశారు. సాగర్ డ్యాంపై తమ విధులు అడ్డుకున్నారంటూ విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు ఫిర్యాదు చేయగా.. ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులపై విజయపురి ఠాణాలో 447, 341 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమపై దాడికి పాల్పడి నాగార్జునసాగర్ డ్యాంపైకి అక్రమంగా చొరబడ్డారంటూ ఇక శుక్రవారం రోజున రాష్ట్ర ఎస్పీఎఫ్ పోలీసులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారితో పాటు ఏపీ నీటిపారుదల శాఖ అధికారులు అనుమతి లేకుండా సాగర్ నీటిని ఏపీకి విడుదల చేశారంటూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై తెలంగాణలో కేసులు నమోదయ్యాయి. ఇలా కృష్ణా జలాల పంపకాల్లో ఇరు రాష్ట్రాల మధ్య మరోసారి నెలకొన్న వివాదం నేపథ్యంలో పోటాపోటీగా కేసులు పెట్టుకోవటం ఇప్పుడు బాగా చర్చనీయాంశమవుతోంది.