తెలంగాణ శాసనసభ ఎన్నికల కౌంటింగ్‌కు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 15 కేంద్రాల్లో రేపు కౌంటింగ్ జరగనుంది. ఆదివారం ఉదయం 5 గంటలకే అధికారులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఉదయం 8 గం.కు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున జరగబోయే ఓట్ల లెక్కింపునకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు.
ఈ సందర్భంగా సీపీలు, ఎస్పీలతో డీజీపీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ.. లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తుపై వారితో సమీక్షించారు. చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని… ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని… ప్రతీకారదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఎలాంటి విఘాతం లేకుండా ఎన్నికల బందోబస్తు నిర్వహించామని…. ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సీపీలు, ఎస్పీలకు సూచించారు.