యాదాద్రి కొండపైకి ఆటోలకు అనుమతి

-

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ  కొండపైకి ఆటోల రాకపోకలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం మార్చి 29వ తేదీ 2022 నుంచి కొండపైకి ఆటోల రాకపోకలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఆదివారం రోజున ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.. జిల్లా కలెక్టర్‌ హన్మంత్‌ కే జెండగే, అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, డీసీపీ రాజేశ్‌చంద్ర, యాదాద్రి దేవస్థాన ఈవో రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, పుర అధ్యక్షురాలు సుధ, ఎంపీపీ చీర శ్రీశైలంతో కలిసి కొండపైకి ఆటోల రాకపోకలను తిరిగి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయిలయ్య స్వయంగా ఆటో నడిపి సందడి చేశారు. పాత కనుమదారి నుంచి రోజుకు 100 ఆటోలను అనుమతిస్తామని తెలిపారు. కొండపైన చలువ పందిళ్లు, డార్మిటరీ హాల్‌ ప్రారంభం, కొబ్బరి కాయలు కొట్టే ఏర్పాటు తదితర అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారనని వారు వాటిపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ నెలాఖరులోగా ఇవన్నీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version