తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీల్లో భాగంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో తమ పొట్ట కొడుతున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఉచిత ప్రయాణం ఆఫర్ తో మహిళలంతా బస్సుల్లోనే ప్రయాణించడంతో తమకు గిరాకీ లేక పొట్టకూటికి కూడా డబ్బు సంపాదించలేక పోతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆటో బంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు.
ఈ బంద్ లో భాగంగా ఆటోడ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయనున్నారు. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నారు. ఆటో డ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని వేముల మారయ్య పిలుపునిచ్చారు. ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతామని, అభ్యర్థుల ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు.