వనపర్తి జిల్లా అమరచింత ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రసవానికి ముందే చిన్నారి తల, మొండెం వేరయ్యాయి. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందును చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే తల్లి ప్రాణాలు కాపాడటం కోసమే పసికందు తల,మొండెం వేర్వేరు చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణి పురిటీ నొప్పులతో సోమవారం అర్ధరాత్రి అమరచింత ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో డాక్టర్లు లేకపోవడంతో అందుబాటులో ఉన్న సిబ్బంది ఆమెకు సాధారణ డెలివరీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఎంత ప్రయత్నించినా పసికందు తల బయటకురాకపోవడంతో కాన్పు మధ్యలోనే 108 వాహనంలో ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ తల్లీబిడ్డలను కాపాడటంలో విఫలమైన సిబ్బంది మహిళను జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు.
అయితే ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కోల్పోయిన మహిళ కుటుంబీకులు ఆమెను ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో తల్లీబిడ్డల్లో ఒక్కరినే కాపాడే అవకాశం ఉందని నిర్ధారించిన వైద్యులు పసికందు తలను మొండెం నుంచి వేరు చేసి తల్లి ప్రాణాలు కాపాడారు. అయితే తల్లి కడుపులోనే ముక్కలైన బిడ్డను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.