కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదు : బండి సంజయ్

-

ఈ రోజు శంషాబాద్ ఎయిర్ పోర్టు కాలనీకి వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్థానిక బీజేపీ నేతలతో కలిసి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం నవగ్రహాల ధ్వంసంపై ఆరా తీశారు. అనంతరం బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధి జె. సంగప్పతోపాటు స్థానిక నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని పిచ్చోళ్లుగా ముద్రవేసి వదిలేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం హిందూ దేవాలయాలు, హిందువులపై మాత్రమే పిచ్చోళ్లు దాడులు చేస్తరా? ఇతర ప్రార్ధన మందిరాల జోలికి వెళ్లరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓట్లేయలేదనుకుంటున్నారా? ఒక వర్గం ఓట్ల కోసం దేవాలయాలపై, హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ఇకపై ఆలయాలపై దాడులు చేస్తే కఠిన చర్యలుంటాయని సీఎం హెచ్చరికలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హిందువులంతా ఏకమై ప్రభుత్వంపై తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version