రానున్న సార్వత్రిక ఎన్నికలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అసలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేద్దామా లేదా అనే అయోమయంలో ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ బరిలో బీజేపీ 17 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు తప్పించుకునేందుకు గులాబీ నాయకులు కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు.
“కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లో గావ్ ఛలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో బండి సంజయ్ పర్యటించారు. చేనేత కార్మికుల పనితీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బండి సంజయ్ అనే బీజేపీ కార్యకర్త 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటాడని తెలిపారు. బీఆర్ఎస్ మెడలు వంచిన ఘనత ఎవరిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా కావొచ్చని, ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. అసెంబ్లీ వేదిక ప్రజా సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి కానీ పార్టీల బలాబలాలు చూపించుకోవడానికి కాదు” అని బండి సంజయ్ విమర్శించారు.