కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారి విస్తరణ పనులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం రోజున ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా కరీంనగర్ – జగిత్యాల, కరీంనగర్ – వరంగల్ (NH-563) జాతీయ రహదారి విస్తరణ పనులపై తన కార్యాలయంలో ఎన్హెచ్ఏఐ అధికారులతో బండి సంజయ్ సమావేశమయ్యారు.
కరీంనగర్ – జగిత్యాల హైవే విస్తరణకు సంబంధించి 15 రోజుల్లోపు టెండర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని బండి సంజయ్ తెలిపారు. మూడు చోట్ల బైపాస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు కరీంనగర్ – వరంగల్ హైవే విస్తరణ పనులు 2025 జులై నెల నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ఇందులో భాగంగా మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్, ఎల్కతుర్తి, హసన్‌పర్తి వద్ద బైపాస్‌లను నిర్మించనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. అంతకు ముందు కరీంనగర్ చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి ఆలయంలో అమ్మవార్లను దర్శించుకుని బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు.