ముగిసిన బండి సంజయ్ అమెరికా పర్యటన..నేడు ఢిల్లీకి రాక

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అమెరికా పర్యటన ముగిసింది. ఈనెల 1న అమెరికా వెళ్లిన బండి సంజయ్ గత 10 రోజులుగా యూఎస్ లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2,3 తేదీల్లో అట్లాంటా జార్జియాలో, 4న నార్త్ కరోలినాలోని చార్లెట్ ఎన్సీ, 5న రాలై, 6న వాషింగ్టన్ డీసీ, 7న న్యూయార్క్, 8న న్యూజెర్సీ, 9న డల్లాస్ లో, 10న ఫ్రిస్కో టెక్సాస్ ప్రాంతాల్లో పర్యటించిన బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా ఎన్నారైలు ముఖ్యంగా తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారతీయ సంస్క్రుతి, సాంప్రదాయాలతో అపూర్వ స్వాగతం పలికారు. బండి సంజయ్ వస్తున్నారని తెలిసి బైక్, కార్ల ర్యాలీలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మరోవైపు బండి సంజయ్ వెళ్లిన ప్రతిచోట ఎన్నారైలు చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు చెబుతూనే ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. భారత సంస్క్రుతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని చాటిపెట్టారు. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో భారత్ సాధించిన విజయాలను, ప్రజల అభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అన్నిరంగాల్లో భారత్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా మారాలంటే మళ్లీ మోదీ రావాల్సిన అవసరాన్ని పదేపదే నొక్కి చెప్పారు.

మోదీని మూడోసారి ప్రధానమంత్రి చేసేందుకు ఎన్నారైల సహకారం కావాలంటూ అభ్యర్ధించారు. అందుకోసం ఎన్నికల సమయంలో ప్రతి ఒక్క ఎన్నారై తగిన సమయాన్ని కేటాయించాలని కోరారు. అదే సమయంలో తెలంగాణలో కొనసాగుతున్న కుటుంబ పాలనపట్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ప్రవాస తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే యత్నం చేశారు. ప్రజాస్యామ్య తెలంగాణ ఏర్పాటు కోసం బీజేపీ చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాలని కోరారు. ఇక ఇవాళ ఢిల్లీకి చేరుకోనున్నారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version