రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ప్రజలను ఆగమాగం చేస్తున్నాయి. వర్షాల ధాటికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరద ముంచెత్తింది. ప్రజలు ఇంకా వరద గుప్పిట్లోనే చాలా ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు నిర్మల్ జిల్లా ప్రజలనూ వరద ఇబ్బందులకు గురి చేస్తోంది.
ముఖ్యంగా నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వేద భారతి పీఠం శివలింగాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని అధికారులు పునరావాస కేంద్రాలుక తరలించారు. బాసర మండలంలోని బిద్రేల్లి వద్ద వరదకు బైంసా – నిజామాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు మొత్తం కోతకు గురైంది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో ఓ వాహనం బోల్తా పడింది.