తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన నిర్ణయాలతో ప్రజలను ఆశ్చర్యపరుస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం రేకెత్తిస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు.. మరికొన్ని నియామకాలను రద్దు చేస్తోంది. తాజాగా బీఆర్‌ఎస్ పార్టీ అమలు చేసిన బీసీ బంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దాని అమలుపై సమీక్ష నిర్వహించాల్సి ఉందని అభిప్రాయపడ్డ ఆయన.. సమీక్ష తర్వాత ఆ పథకం నిర్వహణ గురించి ప్రణాళిక రచిస్తామని తెలిపారు.
బీసీ బంధు పూర్తి స్థాయిలో పారదర్శకంగా అర్హులకు చేరేటట్లు తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో విలీనం కాలేదన్నారు. ఉద్యోగులకు, ప్రజలకు ప్రయోజనం కలిగేలా తాము చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు బంధుపై బీఆర్‌ఎస్ నాయకులు అప్పుడే విమర్శలు చేయడం సరికాదని.. తాము అధికారం చేపట్టి రెండు రోజులకే విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు.