శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్. అయ్యప్పస్వామి ఆలయం దర్శనం సమయం పెంచుతున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం సమయాన్ని పెంచినట్లు వెల్లడించింది. మధ్యాహ్నం విడతలో 3 గంటల నుంచి రాత్రి 11 వరకు దర్శనం సమయం పెంచుతున్నట్లు ప్రకటించింది. అంటే రోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటుండగా తాజాగా మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించడం వల్ల మరో గంట దర్శన సమయం పెరిగినట్లైంది. దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, బిస్కెట్లు అందిస్తున్నట్లు ట్రావెన్కోర్ బోర్డు వివరించింది.
రోజుకు 75వేల మంది భక్తులనే అనుమతించాలని టీడీబీని అభ్యర్థించినట్లు ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90,000 బుకింగ్లు, స్పాట్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తుల సంఖ్య పెరిగిందని .. ఈసారి ఎక్కువ మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు శబరిమలకు తరలివస్తున్నట్లు తెలిపారు. ఎంతో ఆధ్యాత్మికంగా భావించే 18 మెట్లను వారు త్వరగా ఎక్కలేకపోతున్నట్లు పేర్కొన్నారు.