కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ఎలుగు బంటి కలకలం రేపింది. కరీంనగర్ – హన్మకొండ రహదారిలో చెరువు వద్ద ఉన్న చెట్టు పైకి ఎక్కి దోబూచులాడింది. దీంతో చెట్టుపై నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందేమోనని స్థానికులు భయాందోళన గురవుతున్నారు. తెల్లవారుజామున ఇళ్లలోకి వస్తున్న భలుకాన్ని చూసిన కుక్కలు తరమడంతో సమీపంలో ఉన్న చెట్టుపైకి ఎక్కింది.
గమనించిన స్థానికులు… పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎలుగుబంటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. ఎలుగుబంటి చెట్టుపై కూర్చోవడంతో దాన్ని చూసేందుకు స్థానికులు గుమ్మిగూడుతున్నారు. కొంత మంది తమ సెల్ఫోన్లలో ఈ చిత్రాలను రికార్డు చేస్తున్నారు.
మరోవైపు కరీంనగర్ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గ్రానైట్ క్వారీలు ఉండడంతో విరివిగా ఆ పేలుళ్లకు భయపడి ఎలుగుబంట్లు గ్రామాల్లోకి వస్తుంటాయి. నగరంలోని శాతవాహన యూనివర్సిటీలో పలుమార్లు ఎలుగుబంటిని గమనించిన అటవీ శాఖ అధికారులు వాటిని చాకచక్యంగా పట్టుకొని అడవులకు తరలించారు. ఇక ఇప్పుడు తాజాగా మానకొండురూలో భల్లూకం హల్చల్ సృష్టిస్తోంది.