25వేలకు పైగా టీచర్ల ఉద్యోగాలు రద్దు.. తీసుకున్న జీతం వడ్డీతో కట్టాలని హైకోర్టు తీర్పు

-

పశ్చిమ బెంగాల్‌ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్‌ఎల్‌ఎస్‌టీ)పై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన పాతిక వేలకుపైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేస్తూ.. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

9-12 తరగతులకు ఉపాధ్యాయులతోపాటు బోధనేతర సిబ్బంది నియామకం కోసం బెంగాల్‌ సర్కారు ఎస్‌ఎల్‌ఎస్‌టీ-2016 నిర్వహించి నాటి నోటిఫికేషన్‌లో మొత్తం 24,640 ఖాళీలను పేర్కొంది. 23 లక్షల మందికిపైగా పరీక్షకు హాజరు కాగా.. ప్రభుత్వం చివరకు 25,753 మందికి ఉద్యోగాలిచ్చింది. ఆ నియామక ప్రక్రియలో- అర్హుల జాబితాలో లేనివారికి, ఖాళీ ఓఎంఆర్‌ షీట్‌లు సమర్పించినవారికి నియామక పత్రాలు ఇవ్వడం వంటి తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ దాఖలైన 350 పిటిషన్లపై.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన డివిజన్‌ ధర్మాసనం విచారణ నిర్వహించింది.

నియామక ప్రక్రియలో అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి, మూడు నెలల్లోగా నివేదిక సమర్పించాలని సీబీఐని అందులో ఆదేశించింది. అప్పట్లో అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన 25,753 మంది కూడా ఇప్పటివరకు తీసుకున్న వేతనాలను 12 శాతం వడ్డీతో కలిపి తిరిగి ఇచ్చేయాలని తీర్పులో కోర్టు సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news