లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక మరికొంత మంది పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇక తాజాగా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వెంకట్రావుతోపాటు ఆయన సహచరులు కూడా హస్తం పార్టీలో చేరారు.
గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావ్ విజయం సాధించారు. మిగిలిన 8 స్థానాల్లోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. ఇక ఇప్పుడు వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరడంతో 9 ఉమ్మడి ఖమ్మం జిల్లా హస్తం వశమైంది.
ఇక ఇప్పటికే ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే లోక్ సభ ఎన్నికల కంటే ముందే…. మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరవచ్చని తెలుస్తోంది. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు ఉన్నట్లు సమాచారం.