శ్రీరామనవమి పండుగ సమీపిస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన దేశవ్యాప్తంగా ఈ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం కూడా ఈ వేడుకలకు ముస్తాబైంది. ఇప్పటికే ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 6వ తేదీన సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు.
భద్రాద్రి రామయ్య కళ్యాణం వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కావడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరోవైపు శ్రీరామనవమినాడు భద్రాచలంలో నిర్వహించే పూజల వివరాలు అన్నీ ఆన్‌లైన్‌లో ఉంచారు. బ్రహ్మోత్సవ విశేషాలు, ముక్కోటి ఏకాదశి వేడుకల సమాచారం, ఆలయంలో జరిగే పూజల వివరాలు https:bhadradritemple.telangana.gov.inలో పొందుపరిచారు. ఈ సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.